Saket Gokhale Arrest: మోర్బీ ఘటనపై ట్వీట్‌..తృణమాల్‌ నేత అరెస్టు

6 Dec, 2022 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ: తృణమాల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్‌ గోఖలేని గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు డెరెక్‌ ఓబ్రియన్‌ అన్నారు.  ఇది రాజకీయ ప్రతీకార చర్య అని  తృణమాల్‌ కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది. సాకేత్‌ గోఖలే సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి రాజస్తాన్‌లోని జైపూర్‌కి విమానంలో వెళ్లారని, అక్కడ ముందుగానే వేచి ఉన్న గుజరాత్‌ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓబ్రెయిన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తన అమ్మకు ఫోన్‌ చేసి తనను పోలీసులు అహ్మదాబాద్‌ తీసుకువెళ్తున్నారని, మధ్యాహ్నానికి అక్కడకి చేరుకుంటానని చెప్పారు. ఆయనకు పోలీసులు ఫోన్‌ చేయడానికి కేవలం రెండు నిమిషాలే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోఖలే మోర్బీ బ్రిడ్జ్‌ కూలిన ఘటన గురించి కొన్ని వార్తపత్రికల క్లిప్పింగ్‌ల తోపాటు మోర్బీ ప్రధాని పర్యటనకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్టీఐ పేర్కొందని ట్వీట్‌ చేశారు.

ఐతే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆ వార్తలను నకిలీవిగా పేర్కొనడం గమనార్హం. ఐతే ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం గోఖలే చేసిన ట్వీట్లను గుర్తించింది. గోఖలే చేసిన ట్విట్లను దృష్టిలో ఉంచుకునే ఇలా తప్పుడూ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందంటూ తృణమాల్‌ కాంగ్రెస్‌ నేత ఓబ్రెయిన్‌ ఆరోపణలు చేశారు.

ఐతే ఆయన ఇక్కడ ఏ ట్వీట్‌ అనేది స్పష్టం చేయలేదు. ఇలాంటి చర్యలతో తృణమాల్‌కాంగ్రెస్‌ పార్టీని, ప్రతిపక్షాల నోటిని మూయించలేరన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యను మరో స్థాయికి తీసుకువెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. కాగా, జైపూర్ విమానాశ్రయ పోలీసు ఇన్‌ఛార్జ్ దిగ్‌పాల్ సింగ్‌ ఈ విషయమై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఎవరు తెలియజేయ లేదని స్పష్టం చేశారు. 

(చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్‌’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్‌!)

మరిన్ని వార్తలు