వీడియో: అడిగిన వెంటనే ఆటోలో కేజ్రీవాల్‌ జర్నీ.. పోలీసుల అడ్డగింత.. చివరకు అతని ఇంట భోజనం

13 Sep, 2022 08:00 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ఆటోడ్రైవర్‌ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్‌ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. 

సోమవారం జరిగిన ఆటో డ్రైవర్ల కార్యక్రమంలో విక్రమ్‌ దంతానీ అనే డ్రైవర్‌ కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. ‘‘నేను మీ అభిమానిని. పంజాబ్‌లో ఆటో డ్రైవర్‌ ఇంట్లో మీరు భోంచేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో చూశా. మా ఇంట్లో భోజనానికి వస్తారా?’’ అని అడగ్గా కేజ్రీవాల్‌ అంగీకరించారు. ‘‘ఎప్పుడు రమ్మంటారు? నేను బస చేసిన హోటల్‌ నుంచి మీ ఆటోలో తీసుకెళ్తారా?’’ అని అడిగారు. అన్నట్టుగానే రాత్రి విక్రమ్‌ ఆటోలోనే ఆయన ఇంటికి భోజనానికి వెళ్లారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్‌ ప్రయాణిస్తున్న ఆటోను సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌ పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రయాణానికి అంగీకరించబోమని తెలిపారు. అయితే ఆ టైంలో కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు.. ఓ కానిస్టేబుల్‌ ఆ ఆటో డ్రైవర్‌ పక్కన కూర్చోగా, రెండు పోలీసు వాహనాలు ఆ ఆటోను విక్రమ్‌ ఇల్లు ఉన్న ఘాట్లోడియా వరకు అనుసరించాయి. ఇక.. ఇదంతా నాటకమని, కేజ్రీవాల్‌ గొప్ప నటుడని గుజరాత్‌ మంత్రి హర్ష సంఘ్వీ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు