నాలుగు హైకోర్టులకు సీజేలు

13 Feb, 2023 06:04 IST|Sakshi

వీరిలో ఇద్దరు ఈ నెలాఖరులో పదవీ విరమణ

న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గుజరాత్‌ హైకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ సోనియా గిరిధర్‌ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి జస్టిస్‌ జస్వంత్‌ సింగ్‌ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఈ నెల 22న రిటైర్‌ కానున్నారు.

ఇంతకుముందు జస్టిస్‌ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆతర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్‌ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్‌ సందీప్‌ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ అండ్‌ లద్దాఖ్‌ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

కాగా, జస్టిస్‌ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ సబీనా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్‌ గోకానీని తక్షణమే నియమించాలంటూ గత వారం కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో సోమవారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు