ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎసరు!

25 Dec, 2022 18:41 IST|Sakshi

గాంధీనగర్‌: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది.  ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు.  తన బాయ్‌ఫ్రెండ్‌ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది.  థర్డ్‌ ఇయర్‌ బీకామ్‌ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది.

ఇదీ జరిగింది..
అక్టోబర్‌లో జరిగిన బీకామ్‌ థర్డ్‌ఇయర్‌ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్‌లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్‌ నర్మద్‌ సౌత్‌ గుజరాత్‌ యూనివర్సిటీ ఫెయిర్‌ అసెస్‌మెంట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్‌ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. 

విచారణ సందర్భంగా.. కంప్యూటర్‌లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్‌లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్‌ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది.  అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్‌ఇయర్‌ బీకామ్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అవ్వడంతో ఈ ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్‌ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్‌ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్‌ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్‌ మహిళల ఆవేదన

మరిన్ని వార్తలు