ఆ పెళ్లి పత్రిక బరువు ఎంతో తెలుసా?

4 Dec, 2021 18:12 IST|Sakshi

గాంధీనగర్‌: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటారు. ఈ వివాహ కార్యక్రమాల కోసం​ ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరనే విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ షో నుంచి ప్రతివేడుక ప్రత్యేకంగా ఉండాలనుకొని ప్లాన్‌లు వేస్తుంటారు. పెళ్లి వేడుకలకు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లి వేడుక ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి నిలిచింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మౌలేష్‌బాయ్‌ ఉకానీ కుమారుడి వివాహం, సోనాల్బేన్‌ అనే యువతితో నిశ్చయమైంది. తాను.. బిజినెస్‌మ్యాన్‌ కావడంతో తన కొడుకు వివాహ వేడుక గ్రాండ్‌గా చేయాలనుకున్నాడు. తన కుమారుడి పెళ్లి కోసం జోధ్‌పూర్‌లోని  ఉమెద్‌ భవన్‌ ప్యాలెస్‌ను బుక్‌ చేసుకున్నాడు. ఆ ప్యాలెస్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి.

అక్కడ వేడుకలకు గాను.. ఒక రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చార్జ్‌ చేస్తారు. ఆ కల్యాణ మండపంలో ప్లేట్‌ మీల్స్‌ ఖరీదు 18 వేల రూపాయలు.  అయితే, మౌలేష్‌ బాయ్‌ తన కుమారుడి వెడ్డింగ్‌ కార్డును ప్రత్యేకంగా ముద్రించాడు. అది నాలుగు కేజీల బరువును కలిగి ఒక పెద్ద బాక్సు మాదిరిగా ఉంది. దానిలో పెళ్లి పత్రికతోపాటు.. పెళ్లి వేడుకలో జరిగే కార్యక్రమాలు ముద్రించారు. దానిపై కృష్ణుడి ప్రతీమను కూడా ప్రత్యేకంగా ఉండేలా చూశారు.

ఆ పెళ్లి పత్రికలో ప్రత్యేకంగా కొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. దానిలో అతిథుల కోసం ప్రత్యేకంగా, డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్‌లు, స్వీట్‌లను ఏర్పాటు చేశారు. ఆ కార్డు ధర ఏడు వేల రూపాయలు, దాన్ని ప్రత్యేకంగా పింక్‌ కలర్‌లో ముద్రించారు.  దీంతో ఆ పెళ్లి బాక్సు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కాగా, వివాహ వేడుక బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. గత నెలలోనే పెళ్లి జరిగిపోయినప్పటికీ ఈ వార్త మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

మరిన్ని వార్తలు