కలిచివేసే ఘటన: తమ్ముడి మృతదేహాంతో ఎనిమిదేళ్ల చిన్నారి...

10 Jul, 2022 20:51 IST|Sakshi

పేదవాళ్ల కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా చాలా చోట్ల వారు దారుణమైన నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నారు. కనీసం సాటి మనుషులుగా వారికి సాయం చేసేవాళ్లు కూడా ముందుకు రాకపోవడం అత్యంత బాధకరం. కన్న బిడ్డ చనిపోయిన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేని దుస్థితిలో చాలామంది పేదవాళ్లు ఉ‍న్నారు.  గత్యంతరం లేని స్థితిలో వారిని అనాథ శవాలుగా వదిలి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు.

వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లో అంబాహ్‌లోని బద్‌ ఫ్రా గ్రామ నివాసి పూజారామ్‌ జాతవ్‌ తన రెండేళ్ల రాజా అనే కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువచ్చాడు.  ఐతే ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని మోరెనా జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో పూజారామ్‌ స్థానిక ఆస్పత్రి ఇచ్చిన అంబులెన్స్‌ సాయంతో తన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆ చిన్నారి రక్తహీనత, అసిటిస్‌తో బాధపడుతూ చికిత్స సమయంలోనే మరణించాడు. దీంతో పూజరామ్‌ జాతవ్‌ తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు.

ఆస్పత్రిలో వాహనం లేదని బయట వాహనం మాట్లాడుకుని వెళ్లమంటూ ఉచిత సలహ ఇచ్చి పంపేశారు. దీంతో చేసేదేమీ లేక తన పెద్ద కొడుకు గుల్షన్‌ ఒడిలో తన కొడుకు మృతదేహాన్ని ఉంచి వాహనం తీసుకువస్తాని చెప్పి వారిని మోరీనా నెహ్రూ పార్క్ వద్ద ఉంచి వెళ్లాడు. ఐతే పూజారామ్‌కి ఎంత ప్రయత్నించిన ఏ వాహనం దొరకలేదు. దీంతో అతను తన పెద్ద కుమారుడు గుల్షన్‌ని చనిపోయిన రాజాని అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.

పాపం ఆ చిన్నారి చనిపోయిన తన​ తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక పక్క ఈగలు వాలుతూ ఉంటే వాటిని కొడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు ఆ చిన్నారి. ఐతే స్థానిక జనం అధికారులుకు సమాచారం ఇవ్వడంతో...పోలీస్‌ అధికారి యోగేంద్ర సింగ్ అసలు విషయం తెలుసుకని పూజారామ్‌కి సదరు స్థానిక ఆస్పత్రి నుంచే అంబులెన్స్‌ ఏర్పాటు చేసి పంపించారు.

(చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు