‘వ్యాక్సిన్‌ తీసుకోండి..బీరు పట్టుకెళ్లండి’ వినూత్న ఆఫర్

10 Apr, 2021 11:16 IST

టీకా వేయించుకుంటే...ఉచితంగా బీరు

హార్యానాలోని గుర్గావ్‌లోని  రెస్టారెంట్ బంపర్‌ ఆఫర్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం లేదు. అటు మరణాల సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనా టీకాపై ప్రజల ఆసక్తి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా వేయించుకున్న వారికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చిందో రెస్టారెంట్. బిజినెస్ ఇన్‌సైడర్ సమాచారం ప్రకారం, గుర్గావ్ గోల్డ్ రోడ్‌లోని రెస్టారెంట్ టీకా స్వీకరించిన తరువాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్‌  చేస్తోంది. 

ఢిల్లీకి సరిహద్దున ఉన్న హార్యానాలోని గుర్గావ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఈ  ఆఫర్‌ ప్రకటించింది. కరోనా టీకా వేయించుకొని, సంబంధిత  కార్డును చూపిన వారికి బీర్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఏప్రిల్ 5, 2021 న ప్రారంభమైన ఈ ఆఫర్ కేవలం వారం వరకు మాత్రమే  కొనసాగుతుందని వెల్లడించింది. టీకాలు వేయించుకునేలా ప్రజలను  ప్రోత్సహించే ఉద్దేశంతో టీకా లగావో, బీర్‌ లేజావో అంటోంది.  ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో  టీకా వేసుకున్న సంతోషాన్ని పంచుకోండి' అంటూ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.

గత వారం, గుజరాత్ రాజ్‌కోట్‌లోని స్వర్ణకారుల సంఘం టీకా తీసుకున్న మహిళలకు బంగారంతో చేసిన ముక్కు పుడకలను, పురుషులకు హ్యాండ్ బ్లెండర్‌లను అందించింది.అలాగే  జాన్ విజన్ సంస్థ ఉచితంగా ఆహారం అందించింది. అల్పాహారం, లంచ్‌, రాత్రి భోజనం అందిస్తున్నాం కాబట్టి టీకా తీసుకున్న వారు ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాల్సిన అవసరం లేదనీ, వారు విశ్రాంతి తీసుకోవచ్చుని విజన్‌ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా సెకండ్‌ వేవ్‌ : బ్యాంకులకు చిక్కులు)

అయితే కరోనా టీకా తీసుకున్నాక మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు హెచ్చరించారు.  వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత అల్కహాల్‌ వంటివి తీసుకుంటే.. వారిలో కరోనా ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయదని సూచించారు.  మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు తప్పనిసరిగా వీటికి దూరంగా ఉండాలని రష్యాకు చెందిన అడ్వైజరీ ఇటీవల ఒక ప్రకటన  జారీ చేసింది. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలున్నప్పటికీ, వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి మద్యం ఆఫర్‌ చేయడంపై మాత్రం సామాన్యులనుంచి  విమర్శలొస్తున్నాయి. 

మరిన్ని వార్తలు