డేరా బాబాకు రహస్య పెరోల్‌

7 Nov, 2020 16:36 IST|Sakshi

 చండిఘర్‌ : మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌రహీమ్‌సింగ్‌ (డేరా బాబా)బాబాకు రహస్యంగా పెరోల్‌ మంజూరైంది. ఒకరోజు పెరోల్‌పై డేరా బాబా బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి డేరా బాబాకు హరియాణా ప్రభుత్వం అక్టోబర్‌ 24 న పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్‌ లభించిన విషయం మీడియాకు కూడా తెలియకుండా హరియాణా ప్రభుత్వం జాగ్రత్తపడింది. భారీ బందోబస్తు మధ్య గత నెల 24న గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడడానికి డేరా బాబాను తీసుకొచ్చారు. ఆ రోజు  సాయంత్రం వరకూ డేరా బాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు.

డేరా బాబాకు పెరోల్‌ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రాష్ట్ర జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అన్ని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రామ్ రహీమ్‌కు పెరోల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్‌ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు