Guru Mayadhar Raut: ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం 

28 Apr, 2022 13:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్‌(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు.

వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత‍్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్‌ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే  చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. 

ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్‌ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు