చిన్నారి ధైర్యానికి నెటిజనులు ఫిదా

14 Dec, 2020 13:14 IST|Sakshi

భోపాల్‌: ఇంజక్షన్‌ పేరు చెబితే చాలు చిన్నారులతో సహా పెద్దలు కూడా కొందరు భయపడతారు. అలాంటిది సర్జరీ అంటే.. ఇక ఎంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి మాత్రం బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగా.. ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. ఏకంగా సింథసైజర్‌(ఎలక్ట్రానిక్ సంగీత పరికరం) వాయిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. గ్వాలియార్‌కు చెందిన సౌమ్య అనే తొమ్మిదేళ్ల చిన్నారికి తలలో కణితి ఏర్పడింది. తల్లిదంద్రులు చిన్నారిని గ్వాలియర్‌ బీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే సాధారణంగా ఆపరేషన్‌కు ముందు మత్తు మందు ఇస్తారు. కానీ సౌమ్య విషయంలో ఇలా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేయడం ప్రమాదం అని.. దాని వల్ల మెదడులోని ఇతర నరాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ఆమె శస్త్రచికిత్సను 'అవేక్ క్రానియోటమీ'(రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయడం) పద్ధతిలో చేయాలని వైద్యులు నిర్ణయించారు. (చదవండి: బిగ్‌బాస్ షో చూపిస్తూ బ్రెయిన్‌ ఆపరేషన్‌)

ఈ క్రమంలో  చిన్నారి దృష్టి మరల్చడం కోసం వైద్యులు వినూత్న ఆలోచన చేశారు. సౌమ్యకు సర్జరీ చేస్తుండగా సింథసైజర్‌ ఇవ్వాలని... పాప దానితో ఆడుకుంటూ.. శస్త్ర చికిత్స విషయం మర్చిపోతుందని భావించారు. ఇక సర్జరీ చేసే భాగం వరకు మాత్రమే మత్తు మందు ఇచ్చారు. అనంతరం వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి సౌమ్య తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత సౌమ్యను ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని వెల్లడించారు వైద్యులు.

మరిన్ని వార్తలు