Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్‌ సర్వేపై సుప్రీం కోర్టు స్టే

19 May, 2023 16:39 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి.. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కార్బన్‌ డేటింగ్‌ పద్దతి సహా సైంటిఫిక్‌ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 

జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన ఆకారం ‘శివలింగం’ అని పేర్కొంటూ హిందూ ఆరాధకులు, శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కార్బన్‌ డేటింగ్‌(వయసు నిర్ధారణ కోసం) సహా సైంటిఫిక్‌సర్వేకు పురావస్తు శాఖకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో ‘శివలింగం’గా పేర్కొంటున్న ఆకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది.

అయితే.. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీద్‌ ప్యానెల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌.. హైకోర్టు తీర్పుతో విభేదించింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు వద్దు. కాబట్టి శాస్త్రీయ సర్వేను వాయిదా వేద్దాం’’ అని మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది.

మే 16, 2022న జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆ ఆకారం బయటపడింది.

► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. 

► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా..  ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. 

► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్‌ సర్వే నిర్వహించారు.

► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది.

► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ,  అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. ఇక ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మాత్రం తొందరపాటు వద్దని, సైంటిఫిక్‌ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: థ్యాంక్యూ ఇండియా.. సాయంపై చైనా మెసేజ్‌

మరిన్ని వార్తలు