జ్ఞానవాపి మసీదులో శివలింగం!

17 May, 2022 05:40 IST|Sakshi
శివలింగం కనిపించిందని చెబుతున్న జ్ఞాన్‌వాపి మసీదు వజూఖానా

వారణాసి/న్యూఢిల్లీ: ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మందిరం–మసీదు వివాదం మరింత రాజేసే పరిణామాలు జరిగాయి. సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. దానికి రక్షణ కల్పించాలంటూ సోమవారం వారణాసి కోర్ట్‌ ఆఫ్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) రవి కుమార్‌ దివాకర్‌ ను ఆశ్రయించారు.

దాంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. ఎవరూ అందులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కమిటీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్వే సంతృప్తికరం: మేజిస్ట్రేట్‌ శర్మ
సర్వేపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌ రాజ్‌ శర్మ మీడియాతో అన్నారు. సర్వే నివేదిక అందాక తదుపరి చర్యలను మంగళవారం కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వే సమయంలో మసీదులో ఏం దొరికిందనేది అప్పటిదాకా ఎవరూ వెల్లడించరాదన్నారు.

అది ఫౌంటేన్‌ భాగం: మసీదు కమిటీ
సర్వే బృందానికి కనిపించినది ఫౌంటెయిన్‌కు చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదని మసీదు కమిటీ పేర్కొంది. తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది.

మరో మసీదును కోల్పోలేం
తాజా పరిణామాలపై మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘బాబ్రీ’ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు. అటువంటి యత్నాలను తిప్పికొట్టాని పిలుపునిచ్చారు. ‘‘బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతినబూనాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని ఆరోపించారు.

నిజం తేలాల్సిందే: యూపీ డిప్యూటీ సీఎం
సర్వే ఫలితంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య సంతృప్తి వ్యక్తం చేశారు. నిజం ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాకతప్పదన్నారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదన్న వాదన తాజా ఘటనతో రుజువైందని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఆధారాలను దేశ ప్రజలంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాలకు నిత్య పూజలకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు  పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

చదవండి: ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు.. సీఎం ఫైర్‌

మరిన్ని వార్తలు