జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

19 May, 2022 13:28 IST|Sakshi

న్యూడిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తామే విచారణ చేపడతామని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. దీనిపై విచారణ చేపట్టనుంది. వారణాసి విచారణపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. సర్వే నివేదికలోని అంశాలను బయటపెట్టొద్దని స్పష్టంచేసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ జ్ఞానవాపి మసీదులో సర్వే జరిగింది. సర్వే సందర్భంగా మసీదులో శివలింగం బయటపడినట్టు హిందూవర్గం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ముస్లిం వర్గం మాత్రం అది శివలింగం కాదు ఫౌంటెన్ అని వాదిస్తోంది. ఈ క్రమంలో శివలింగం గుర్తించినట్టు చెబుతున్న ప్రాంతాన్ని కోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా అధికారులు సీజ్ చేశారు. మరోవైపు జ్ఞానవాపి మసీదు సర్వేకు సంబంధించిన నివేదిక వారణాసి కోర్టుకు చేరింది. దీనికి సంబంధించిన నివేదిక, వీడియో చిప్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టు అసిస్టెంట్ కమిషనర్లు విశాల్‌ సింగ్‌, అజయ్‌ప్రతాప్ సింగ్‌ న్యాయస్థానానికి సమర్పించారు .నివేదిక 10 నుంచి 15 పేజీలు ఉన్నట్టు వెల్లడించారు.
చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే.. తాఖీర్ రజా వ్యాఖ్యలపై దుమారం

కాగా మసీదు సర్వేలో వెలుగు చూసిందంటున్న శివలింగం పక్కనున్న గోడను, దాంతోపాటు అక్కడి బేస్‌మెంట్‌ను మూసేందుకు నింపిన ఇటుకలు, సిమెంటు, ఇసుక తదితరాలను తొలగించాలంటూ హిందూ పక్షం, దానిపై తమ అభ్యంతరాల దాఖలుకు రెండు రోజుల సమయం కోరుతూ ముస్లింలు వారణాసి జిల్లా సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించిన పలు పిటిషన్లపై వారణాసి జిల్లా సివిల్‌జడ్జి కోర్టులో బుధవారం జరగాల్సిన విచారణ లాయర్ల సమ్మెతో వాయిదా పడింది. 

>
మరిన్ని వార్తలు