Gyanvapi Mosque: జ్ఞానవాపి సర్వే పూర్తి

20 May, 2022 05:35 IST|Sakshi
జ్ఞానవాపి మసీదు బయట భద్రత

శుక్రవారం సుప్రీంలో విచారణ

దిగువ కోర్టు విచారణ 23కు వాయిదా

వారణాసి: జ్ఞానవాపి– శ్రింగార్‌ గౌరీ కాంప్లెక్సులో కోర్టు నియమించిన అధికారుల సర్వే పూర్తయింది. ఈ సర్వే నివేదికను కమిషనర్ల బృందం గురువారం జిల్లా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు సర్వే చేసిన వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించామని స్పెషల్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ చెప్పారు. సర్వే నివేదికలో ఏముందో చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేసు విచారణను శుక్రవారం తర్వాత చేపట్టాలని దిగువ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతో కేసులో తదుపరి విచారణను ఈనెల 23న చేపడతామని వారణాసి సివిల్‌ కోర్టు వెల్లడించింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా సివిల్‌ కోర్టులో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నిర్మాణంలోని కొన్ని గోడలను పగలగొట్టే పని కొనసాగించాలని వాది పక్షం కోర్టును కోరిందని, దీన్ని తాము వ్యతిరేకించామని ముస్లిం పక్ష న్యాయవాది అభయ్‌ చెప్పారు. అక్కడ కొలనులోని చేపలను వేరేచోటికి మార్చాలని ప్రభుత్వ న్యాయవాది కోరారని, దీన్ని తాము వ్యతిరేకించామని చెప్పారు.

శివలింగం కనుగొన్నట్లు చెబుతున్న ప్రాంతానికి తూర్పున ఒక బేస్‌మెంట్‌ ఉందని పిటిషనర్లు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ బేస్‌మెంట్‌ను రాళ్లు, ఇసుకతో మూసివేశారని,  నంది విగ్రహానికి ముందు ఒక బేస్‌మెంట్, ఒక గోడ ఉన్నాయని, గోడ తొలగింపు, బేస్‌మెంట్లో సర్వేకు అనుమతివ్వాలని కోరారు.  పశ్చిమం గోడకున్న తలుపును తెరవాలని, లోపల  సర్వే చేపట్టాలని వీరు తమ పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు బుధవారం దీనిపై విచారణ జరపాలని నిర్ణయించినా ఆ రోజు లాయర్ల సమ్మె జరగడంతో గురువారం విచారణ చేపట్టింది.  

అప్పటివరకు ఆపండి
జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన కేసులో ప్రతివాది తరఫు న్యాయవాది అనారోగ్యంతో ఉన్నందున తదుపరి విచారణను శుక్రవారం చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అంతవరకు జ్ఞానవాపి కేసులో విచారణ నిలిపివేయాలని దిగువ కోర్టుకు సూచించింది. హిందూ భక్తుల తరఫు ప్రధాన న్యాయవాది హరిశంకర్‌జైన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా పూర్తిగా కోలుకోలేదని న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.

దేశవ్యాప్తంగా పలు మసీదులను సీలు వేయాలంటూ కేసులు నమోదవుతున్నాయని ముస్లింల తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ తెలిపారు. జ్ఞానవాపి మసీదులో వజుఖానా చుట్టూ ఉన్న గోడను కూల్చేందుకు అనుమతి కోరుతూ దిగువ కోర్టులో పిటిషన్‌ దాఖలైందన్నారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది హాజరు కానందున తదుపరి విచారణ జరిపే వరకు దిగువ కోర్టులో ప్రొసీడింగ్స్‌ నిలిపివేయాలని కోరారు. దీంతో ఈ కేసును మే 20 మధ్యాహ్నం లిస్టింగ్‌కు తీసుకురావాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ తదితరుల బెంచ్‌ ఆదేశించింది.

త్రిశూలం, ఢమరుకం..
జ్ఞానవాపి సర్వేలో శేషనాగుతో పాటు  దేవతల పగిలిన విగ్రహాలు, త్రిశూలం, ఢమరుకం కనిపించాయని మాజీ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా ఇండియాటుడే ఇంటర్వ్యూలో చెప్పారు. సర్వే ప్రాంతంలో దేవాలయ పగిలిన ఇటుకలతో ఏర్పడిన రాళ్లగుట్టల పోగులు కనిపించిందని చెప్పారు. శిథిలాల్లో శేషనాగుడి పడగ ప్రతిమ ఉందన్నారు. రాళ్ల గుట్టలకు 600 ఏళ్ల వయసుంటుందన్నారు. శివలింగాకారం ఉండడం నిజమేనని, తన నివేదికలో దీనిని పేర్కొనలేదని తెలిపారు. సనాతన సంస్కృతికి చెందిన తామర, ఢమరుకం, త్రిశూలం లాంటి ఆనవాళ్లు కనిపించాయన్నారు.

మథుర కేసు విచారణకు కోర్టు అంగీకారం
మథుర: కత్రా కేశవ్‌ దేవ్‌ మందిర కాంప్లెక్స్‌లోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలనే పిటిషన్‌కు విచారణార్హత ఉందని మథుర జిల్లా కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్‌ను గతంలో నిరాకరించిన సివిల్‌ సీనియర్‌ డివిజన్‌ జడ్జి కోర్టు తాజాగా దీన్ని విచారించాల్సిఉంది.  2020 సెప్టెంబర్‌25న లక్నోకు చెందిన రంజన అగ్నిహోత్రితో పాటు మరో ఆరుగురు భగవాన్‌ శ్రీకృష్ణ విరాజమాన్‌ సన్నిహితులుగా పేర్కొంటూ  సివిల్‌ సీనియర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

శ్రీకృష్ణ జన్మభూమిట్రస్ట్‌కు చెందిన 13.37 ఎకరాల్లో షాహీ ఈద్గా మసీదు నిర్మాణం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ మసీదును తొలగించి సదరు భూమిని ట్రస్టుకు అప్పగించాలని వారు కోరారు. అయితే ఈ పిటీషన్‌ను సెప్టెంబర్‌ 30, 2020లో సివిల్‌ సీనియర్‌ జడ్జి తోసిపుచ్చారు. షాహీ ఈద్గా మసీదులో హిందూ గుడి ఆనవాళ్లున్నాయా, లేదా పరిశీలించేందుకు పురాతత్వ శాఖ బృందాన్ని పంపాలని సీనియర్‌ సివిల్‌ కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. అదేవిధంగా మసీదులోపలి గుడి ఆనవాళ్లను రక్షించేందుకు అందులో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, బయటివారు మసీదులో ప్రవేశించకుండా నిషేధించానలి కోరుతూ మరో పిటీషన్‌ దాఖలైంది.

మరిన్ని వార్తలు