ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే! మొత్తం కేసులు ఎన్నంటే..

14 Mar, 2023 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌3ఎన్‌2 వైరస్ కారణంగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

దేశంలో మార్చి 9 వరకు హెచ్‌3ఎన్‌2 సహా మొత్తం 3,038 ఇన్‌ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి.

ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు.

ఈ ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు.

ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1), హెచ్‌3ఎన్2, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా- బీ వైరస్‌ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్‌3ఎన్‌2, హెచ్‌3ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు.

లక్షణాలు ఇలా.. 
ఇన్‌ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్‌ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు