అభినందించాలంటే సిగ్గుగా ఉంది..

29 Oct, 2020 11:00 IST|Sakshi

ప్రాజెక్టు ఆలస్యంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆలస్యానికి కారణమైన అధికారుల ఫోటోలు వేలాడదీయాలి!

సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టుల జాప్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్‌పూర్‌లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ భవనం నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలస్యానికి బాధ్యులైన అధికారుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు జాతీయ రహదారి అథారిటీలో తక్షణమే సంస్కరణలు అవసరమన్నారు. పనిచేయని ఉద్యోగులపై చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ  ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని కేవలం రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ప్రకటించిన ఆయన  కేవలం 250 కోట్ల ఈ ప్రాజెక్టును పూర్తికి జరిగిన ఆలస్యాన్ని ప్రశ్నించారు. అనవసరమైన గందరగోళాలను సృష్టించి జాప్యం చేస్తున్న అధికారుల ఫోటోలను సంబంధిత భవనం గోడలపై వేలాడదీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజలు ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ భవనం ప్రారంభోత్సవంగా సందర్బంగా అధికారునుద్దేశించి మాట్లాడుతూ "ఎలా పలకరించాలోఅర్థం కావడంలేదు.. మిమ్మల్ని అభినందించాలంటే నాగే సిగ్గుగా ఉందంటూ'' మొదలుపెట్టారు. ఎన్‌హెచ్‌ఏఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం తనకు అవమానకరంగా ఉందన్నారు. 2008లో ఈ భవన  నిర్మాణానికి నిర్ణయించాం. 2011లో టెండర్ పిలిచాం.. 200-250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 9 సంవత్సరాల కాలం పట్టిందని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారుల ఫోటోల భవన గోడలపై వేలాడదీస్తే.. ఆ అధికారుల నిర్వాకం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పని పూర్తి కావడానికి రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది అధ్యక్షులు మారారని ఆయన గుర్తు చేశారు. భవిషత్తులో ఈ లోపాలను సరిచేసుకుని, వేగంగా పనులు పూర్తి చేయల్సిన అవసరం ఉందని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు సూచించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా