ధోలావీరాకు యునెస్కో గుర్తింపు

28 Jul, 2021 02:28 IST|Sakshi

ధోలవిరా: హరప్పా నాగరికత కాలం నాటి నగరం ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యునెస్కో మంగళవారం ప్రకటించింది. చైనాలోని ఫుఝౌలో జరుగుతున్న 44వ యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాల్లోనే తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రకటించడం తెల్సిందే.

తాజా ప్రకటనతో భారత్‌లోని మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరినట్లయింది. అదేవిధంగా, గుజరాత్‌లో యునెస్కో గుర్తించిన ప్రాంతాల జాబితాలో పావగఢ్‌ సమీపంలోని చంపానెర్, పటన్‌లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్‌ సరసన నాలుగో ప్రాంతంగా ధొలావి చేరింది. భారతదేశ చరిత్రలో గుజరాత్‌ రాష్ట్రం రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతం ఖదీర్‌ దీవిలో ధోలావీరా మహానగరానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1,800 సంవత్సరం వరకు సుమారు 1,200 ఏళ్లపాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. ఆనాటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి. 

మరిన్ని వార్తలు