ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా..ఏటీఎం రేషన్‌!

16 Jul, 2021 18:55 IST|Sakshi

చండీగఢ్‌: దేశంలో తొలిసారిగా రేషన్‌ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్‌ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రేషన్‌ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్‌ టచ్‌స్క్రీన్‌ ద్వారా పని చేస్తుందని తెలిపారు.

దేశంలోనే మొట్టమొదటి రేషన్‌ ఏటీఎం
ఈ ఏటీఎం మెషీన్‌లో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్‌ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్‌ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ వెల్లడించారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్‌ ఏటీఎం కాగా.. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ మెషిన్‌ కారణంగా పంపిణీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు కనుక రేషన్‌ సరుకుల కొరతను కూడా ఇది తగ్గించనుందని తెలిపారు. ఈ ఏటీఎంలో రేషన్‌ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కాగా ప్రస్తుతం ఫరూక్‌నగర్‌లో ప్రారంభించిన ఏటీఎంలో గోధుమలు మాత్రమే అందుబాటులో  ఉంచినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు