ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్‌కు హార్దిక్‌ షాక్‌

2 Jun, 2022 18:06 IST|Sakshi

గాంధీనగర్‌: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం కోసం ఒక చిన్న సైనికుడిగా పనిచేయనున్నట్లు తెలిపారు. యావత్‌ ప్రపంచానికే మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు. ఇక గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయం చుట్టూ హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.

కాగా 28 ఏళ్ల యువ పాటిదార్‌ నేత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2020లో గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకయ్యారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయాలపై అసంతృప్తి చెందిన హర్దిక్‌ బహిరంగంగా ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చారు. కొన్ని రోజులకు(మే 18న) కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. 
చదవండి: మా చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్‌ ఖాన్‌

అయితే తాను పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఎవరి ముందు ఎలాంటి డిమాండ్‌లు పెట్టలేదన్నారు. ప్రజల కోసం పనిచేయడానికే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మరికొన్ని నెలల్లో గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి: బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్‌ నేత

మరిన్ని వార్తలు