స్వరం మార్చిన పీసీసీ చీఫ్‌.. ఆందోళనలో కాంగ్రెస్‌ అధిష్టానం!

22 Apr, 2022 16:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హస్తం నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. కాగా, భవిష్యత్‌ ప్రణాళికలపై ఇప్పటికే కాంగ్రెస్‌ చర‍్యలకు దిగింది. పార్టీ ప్రక్షాళనకు ప్లాన్స్‌ తయారుచేస్తోంది. 

అయితే, ఈ ఏడాది చివరలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. తాజాగా గుజ‌రాత్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ ప‌టేల్ చేసిన వ్యాఖ‍్యలు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హర్ధిక్‌ పటేల్‌.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేయగా.. శుక్రవారం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. హఠాత్తుగా హార్ధిక్‌.. హిందుత్వ బాణిని వినిపించారు.

అలాగే బీజేపీని ప్రశంసిస్తూ కామెంట్స్‌ చేశారు. ‘‘బీజేపీకి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. వాటిని మనం అంగీకరించాలి. రాజకీయంగా ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాలి. అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి ఉందని మనం అంగీకరించాలి. అలాగే గుజరాత్‌లో కాంగ్రెస్‌ బలంగా మారాంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలి’’ అన్ని అన్నారు. 

మరోవైపు.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్‌ పటేల్‌ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వ‌ద్దా అన్న‌ది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాన‌ని అన్నారు. బీజేపీలో చేరే ఆలోచనలేదని తెలిపారు. కాగా, హార్ధిక్ ప‌టేల్ కాంగ్రెస్ సంస్థాగ‌త వ్యవ‌హారాల ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా తాను పీసీసీ బాధ్యత‌లు నిర్వర్తించ‌లేన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. తన పనులకు కొందరు అడ్డుతగులుతున్న కారణంగా ప్రజల పక్షాన పోరాడలేకపోతున్నానని గుజ‌రాత్ నేత‌ల‌పై అధిష్టానానికి హార్ధిక్‌ ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు