రామ్‌దేవ్‌ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌

23 May, 2021 20:22 IST|Sakshi

రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మంత్రి హర్షవర్థన్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్‌ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్‌ లేఖ రాశారు. కోవిడ్‌ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు