భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్‌ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు

6 May, 2022 05:58 IST|Sakshi
పట్టుబడిన ఉగ్రవాదులు వీరే

చండీగఢ్‌: భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌ అండతో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు వేసిన పథకాన్ని పోలీసు బలగాలు బట్టబయలు చేశాయి. హరియాణాలోని కర్నాల్‌ గురువారం వేకువజామున జరిపిన సోదాల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌కు పేలుడు పదార్థాలతో వెళుతున్న వాహనం పట్టుబడింది. అందులో ఉన్న మూడు ఐఈడీలతోపాటు, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హరియాణా డీజీపీ పీకే అగర్వాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేంద్ర నిఘావర్గాల  సమాచారం మేరకు పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టారు. అనుమానిత ఇన్నోవా వాహనం వెనుకే బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌తోపాటు నాలుగు వాహనాల్లో పోలీసులు అనుసరించారు. బస్తారా టోల్‌ ప్లాజా వద్ద ఇన్నోవాను అడ్డగించి అందులోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని లూధియానాకు చెందిన భూపీందర్‌ సింగ్, ఫిరోజ్‌పూర్‌ జిల్లాకి చెందిన పర్మీందర్‌ సింగ్, గురుప్రీత్‌ సింగ్, అమన్‌దీప్‌ సింగ్‌లుగా గుర్తించారు.

వాహనంలో ఉన్న 2.5 కిలోల చొప్పున బరువైన మూడు పాత్రల్లో ఉన్న ఆర్డీఎక్స్‌ను, పాక్‌ తయారీ పిస్టల్, రూ.1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో అందజేయడానికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వీరు వెల్లడించారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న హర్వీందర్‌ సింగ్‌ రిందా వీరికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేశాడు. వీటిని ఎక్కడెక్కడికి తరలించాలో ప్రత్యేక యాప్‌ ద్వారా సూచనలు చేస్తున్నాడని డీజీపీ తెలిపారు.

గతంలో కూడా వీరు  పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ముందుగానే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో ఇతడు ఆయుధాలను, డ్రగ్స్‌ను జార విడుస్తున్నాడని అన్నారు. పట్టుబడిన నలుగురికి కర్నాల్‌ న్యాయస్థానం 10 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్లు పంజాబ్‌ డీజీపీ వీకే భావ్రా అన్నారు. అనుమానిత ఉగ్రవాదుల వాహనాన్ని దాదాపు 300 కిలోమీటర్ల దూరం వెంబడించామన్నారు. బుధవారం రాత్రి ఫిరోజ్‌పూర్‌ నుంచి మొదలై గురువారం ఉదయం కర్నాల్‌లో ఈ సుదీర్ఘ ఛేజింగ్‌ ముగిసిందని చెప్పారు.

మరిన్ని వార్తలు