Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్‌

19 Jul, 2022 14:30 IST|Sakshi

చండీగఢ్: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్‌ బిష్ణోయ్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా  సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్‌ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. పంచగావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఓ డంపర్ డ్రైవర్ డీఎస్పీపై నుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకే డీఎస్పీ వెళ్లారని, తన వెంట బలగాలను తీసుకువెళ్లే సమయం లేదని పేర్కొన్నారు. నిందితులు హత్యకు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు.

వదిలిపెట్టేది లేదు..
డీఎస్పీ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా మైనింగ్ మినిస్టర్ మూల్ చంద్‌ శర్మ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా చర్చించినట్లు చెప్పారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కూడా నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సురేంద్ర సింగ్ కుటుంబానికి రూ.50లక్షలు బ్యాంకు ద్వారా , మరో రూ.50లక్షలు ప్రభుత్వం తరఫున పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోలీసు శాఖ మొత్తం డీఎస్పీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

చదవండి: వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?!

మరిన్ని వార్తలు