చాలీచాలని జీతం, ఇదేనా జీవితం.. ఉద్యోగం వద్దని బిర్యానీ బిజినెస్‌ పెట్టిన టెకీలు!

9 Mar, 2022 21:12 IST|Sakshi

చండీఘ‌ఢ్:  రోజూ ఉదయాన్నే లేవడం, ఉద్యోగానికి వెళ్లడం, 9 నుంచి 5 వరకు పని చేయడం. నెల చివర్లో చాలీచాల‌ని జీతం. ఈ రొటీన్‌ జీవితం విసుగుచెందిన ఇద్దరు టెకీలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వ‌దులుకుని పుడ్‌ బిజినెస్‌ పెట్టారు. కొత్త రకం వెజ్ బిర్యానీ అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. గతంలో తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు కంటే ప్రస్తుతమే సంతృప్తిక‌రంగా ఉన్నారని చెప్తున్నారు. హ‌ర్యానాలోని సోనిప‌ట్‌లో వెజిట‌బుల్ బిర్యానీ స్టాల్ న‌డుపుతున్న వారిద్దరూ ఏం చెబుతున్నారంటే.. 

తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో అది పెద్దగా నచ్చేది కాదని అప్పుడు కూడా వ్యాపారం వైపే తమ చూపు ఉండేదని వారు తెలిపారు. అందుకే వారిద్దరు కలిసి ఇంజ‌నీర్ వెజ్ బిర్యానీ పేరుతో ఫుడ్ బిజినెస్‌లోకి దిగినట్లు టెకీలు రోహిత్‌, స‌చిన్ చెబుతున్నారు. సోనిప‌ట్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లోనూ వీరి స్టాల్ మనకు క‌నిపిస్తుంది. వాళ్లకి జాబ్‌లో వ‌చ్చే జీతం కంటే వ్యాపారంలో అధికంగా సంపాదిస్తున్నామని అంటున్నారు. నూనె లేకుండా వారు వడ్డించే వెజ్ బిర్యానీ ప్లేట్ రూ 70, హాఫ్ ప్లేట్ రూ 50గా ధ‌ర నిర్ణ‌యించారు. ధర తక్కువ, పైగా వారి వెజ్‌ బిర్యానీ రెసిపీ అందరికీ నచ్చడం, లాభాలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకేముంది వారు ఆ వ్యాపారాన్ని విస్తరించాలని కూడా ఆలోచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు