భారీగా కేసులు, వారంపాటు హరియాణ లాక్‌డౌన్‌

2 May, 2021 16:11 IST|Sakshi

చండీఘడ్‌: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మరో రాష్ట్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో హరియాణా ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హరియాణాలో రోజుకు పదిహేను వేలకు చేరువగా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు  రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించారు.

మే 3 సోమవారం నుంచి మొత్తం వారం రోజుల పాటు రాష్ట్రం మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ ట్వీట్‌ చేశారు. శనివారం కొత్త కేసులు 13,.588 నమోదు కాగా వాటితో కలిపి రాష్ట్రం మొత్తం నమోదైన కేసులు 5,01,566, మొత్తం మృతుల సంఖ్య 4,341కు చేరింది. దేశంలో  ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఢిల్లీలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు కూడా రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు