హరియాణ కీలక నిర్ణయం

27 Jul, 2020 11:16 IST|Sakshi

గాంధీ కుటుంబ ఆస్తులపై విచారణ

చండీగఢ్‌ : హరియాణలో గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గాంధీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టాలని హరియాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్నీ ఆనంద్‌ అరోరా సోమవారం నగర స్ధానిక పరిపాలనా సంస్థల శాఖను కోరారు.  2004 నుంచి 2014 మధ్య భూపీందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై హరియాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గాంధీ కుటుంబానికి చెందిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు అప్పటి హరియాణ కాంగ్రెస్‌ సర్కార్‌ కారుచౌకగా కట్టబెట్టిన ప్లాట్‌ను ఇప్పటికే ఈడీ అటాచ్‌ చేసింది. 2005లో హరియాణ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈప్లాట్‌ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని ఈడీ ఆరోపిస్తోంది.

ఇక రాష్ట్రంలో గాంధీ కుటుంబ ఆస్తులపై విచారణ పర్వం కొనసాగుతోందని, గురుగ్రాంలో అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు కేటాయించిన మరో ప్లాట్‌పైనా ఆరా తీస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర ప్రభుత్వ సమాచారం నేపథ్యంలో హరియాణ ప్రభుత్వం గాంధీ కుటుంబ ఆస్తులపై విచారణకు ఆదేశించింది. కాగా గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లపై విచారణకు ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి హుడా గత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. చదవండి : సినిమా ట్విస్ట్‌ను తలపించే ఘటన

మరిన్ని వార్తలు