రైతులకు మద్దతుగా.. పెళ్లి కొడుకు వినూత్న ఆలోచన

5 Dec, 2020 19:58 IST|Sakshi

చండీగఢ్‌: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో హరియాణాకు చెందిన ఓ పెళ్లికొడుకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్‌పై పెళ్లి మంటపానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం సిటీకి మారి ఉండవచ్చు. కానీ మన మూలాలు మాత్రం వ్యవసాయమే. రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి జనాల మద్దతుందని తెలపడం కోసమే ఇలా ట్రాక్టర్‌పై మండపానికి వచ్చాను అని తెలిపాడు. (చదవండి: రైతులకు బాసటగా..లంగార్‌ సేవలు)

ఇక వరుడి తల్లి మాట్లాడుతూ.. ‘పెళ్లికి కూడా భారీగా ఖర్చు చేయాలని మేం అనుకోవడం లేదు. సింపుల్‌గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మిగతా డబ్బుని రైతులకు భోజనం అందిస్తున్న గురుద్వార స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తాం’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు