మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య

14 Sep, 2020 18:19 IST|Sakshi

భూమి పూజ విషెస్‌: హసీన్‌ జహాన్‌కు వేధింపులు

గతంలో పోలీసులకు ఫిర్యాదు

తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

కోల్‌కతా: టీమిండియా పేసర్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు తన కూతురికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రామ మందిర భూమి పూజ సందర్భంగా తనకు సోషల్‌ మీడియాలో ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అత్యాచార, హత్య బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ మేరకు హైకోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్‌ జహాన్ ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కూతురితో కలిసి ఆమె కోల్‌కతాలో నివసిస్తున్నారు. ‌(చదవండి: పోలీసులను ఆశ్రయించిన హసీన్‌ జహాన్‌)

ఈ క్రమంలో అయోధ్యలో ఆగష్టు 5న రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా శుభాభినందనలు తెలిపినందుకు కొంతమంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు హసీన్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. హిందూ సోదర, సోదరీమణులను ఉద్దేశించి అభినందనలు తెలుపుతూ.. పోస్టు పెట్టగానే కొంతమంది తనను అసభ్యపదజాలంతో దూషించారని, మరికొంత మంది రేప్‌ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని, అభద్రతాభావం వెంటాడుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా : షమీ)

మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు తన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక షమీ తనను హింసిస్తున్నాడని, హతమార్చేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. హసీన్‌ జహాన్‌ మోడల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు