హథ్రాస్ ఘటన‌: న్యాయం చేసే ఉద్దేశముందా?

4 Oct, 2020 14:57 IST|Sakshi

లక్నో: హథ్రాస్‌ ఘటనకు కారణమైనవారికి కఠినమైన శిక్ష తప్పదని చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు. అయితే, ఇప్పటికే ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సీబీఐ విచారణ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఐ విచారణ పేరుతో కాలయాపన చేస్తారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలనే ఉద్దేశముంటే జ్యుడీషియల్‌ విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలతో హథ్రాస్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.

ఇదిలాఉండగా.. కేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం ప్రకటించినప్పటికీ సిట్‌ బృందం బాధిత కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతోపాటు ఘటన గురించి తెలిసిన ఇంకెవరైనా స్టేట్‌మెంట్‌ ఇవ్వొచ్చునని సిట్‌ పేర్కొంది. కాగా, గత గురువారం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన సిట్‌ బృందం, గ్రామస్తులతో భేటీ అయింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి భగవాన్‌ స్వరూప్‌ సిట్‌ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. పొలం పనులకు వెళ్లొస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులానికి చెందిన 14 మంది వ్యక్తులు అత్యాచారం చేసి, దారుణంగా హింసించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
(చదవండి: దళిత యువతి వీడియో క్లిప్‌పై హల్‌చల్‌)

తీవ్రంగా గాయపడిన యువతి ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందింది. యువతి మరణవార్త బయటికి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులకు కఠిన శిక్షలు పడాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు తీశాయి. ఈక్రమంలోనే అదే రాత్రి 2.30 గంటలకు యువతి మృతదేహానికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఇక కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్‌ గాంధీ బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించిన సంగతి తెలిసిందే.
(చదవండి: రేప్‌ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..)

మరిన్ని వార్తలు