‘హత్రాస్‌ రేప్‌’ కేసులో మరో కోణం

1 Oct, 2020 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచారానికి గురై అన్యాయంగా అసువులు బాసిన 19 ఏళ్ల దళిత యువతి పేరును చట్ట ప్రకారం ఎవరు వెల్లడించడానికి వీల్లేదు. ఒకవేళ బాధితురాలు స్వయంగా అనుమతిస్తే పేరు బహిర్గతం చేయవచ్చు. ఈ కేసులో బాధితురాలు మరణించినందున ఆమె సమీప బంధువుల అంగీకారం తీసుకోవడంతోపాటు  కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన స్వచ్ఛంద సంక్షేమ సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటివేవి లేకుండానే ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆ యువతి పేరును బహిర్గతం చేశారు. (హథ్రాస్‌ హైటెన్షన్‌ : రాహుల్‌, ప్రియాంక అరెస్ట్‌)

ఠాకూర్‌ కులానికి చెందిన సందీప్, రాము, లవ్‌కుష్, రవి అనే యువకులు దారుణ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించినందున , పైగా ఆమె మరణించినందున  బాధితురాలి పేరును బహిర్గతం చేయాల్సి వచ్చిందని అక్కడి పోలీసు వర్గాలు సమర్థించుకుంటున్నాయి గానీ అది సమంజసం కాదు. అయితే ఆ దళిత యువతి పేరు బయటకు రావడం వల్లనే హత్రాస్‌ జిల్లాలోని ఛాంద్‌పా ప్రాంతంలోని బూలగార్హిలో ఆమె కుటుంబం నివసిస్తోన్న విషయం మీడియాకు తెల్సింది. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు)

ఆ గ్రామంలో అంటరానితనం ఇంకా రాజ్యమేలుతోంది. అందుకని అక్కడ ఠాకూర్లకు, దళితులకు అసలు పడదు. బాధితురాలి దళిత కుటుంబం నివసిస్తోన్న రోడ్డుకు ఆవలి పక్కనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఠాకూర్ల కుటుంబం నివసిస్తోంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బాధితురాలి తాతను ఆ ఠాకూర్‌ కుటుంబం పిలిపించి పశువుల కాపలా విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో చేతి వేళ్లు తెగ నరికారని తెల్సింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య కోపతాపాలు రగులుతూనే ఉన్నాయి. అయితే ఠాకూర్లదే ఎప్పుడు పైచేయిగా ఉంటూ వస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఠాకూర్లకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం)

మరిన్ని వార్తలు