‘హాథ్రస్‌ కుటుంబాని’కి మూడంచెల భద్రత

15 Oct, 2020 06:38 IST|Sakshi

సుప్రీంకు తెలిపిన యూపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలియజేసింది. హాథ్రస్‌ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్‌ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది.

బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు.. 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు  తెలిపింది. కాపలాగా ఉన్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకో రాదని పోలీసులకు ఆదేశాలిచ్చామని, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు