CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!

18 Nov, 2021 07:06 IST|Sakshi

వీడ్కోలు సభకు దూరంగా సీజే సంజీబ్‌ బెనర్జీ

సాక్షి, చెన్నై : ‘ నన్ను క్షమించండి’ అంటూ వీడ్కోలు కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి, బరువెక్కిన హృదయంతో సీజే సంజీబ్‌ బెనర్జీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బందికి లేఖ రాసి పెట్టి రోడ్డుమార్గంలో కోల్‌కతాకు బుధవారం బయలుదేరి వెళ్లారు. వివరాలు.. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోల్‌ కతాకు చెందిన సంజీబ్‌ బెనర్జీ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, హఠాత్తుగా ఆయన్ని ప్రాధాన్యత లేని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం చర్చకు దారితీసింది.

ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పోరాటాలు చేసినా ఫలితం శూన్యం. ఈ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో గౌరవంగా బాధ్యతల నుంచి సంజీబ్‌ బెనర్జీ తప్పుకున్నారు. న్యాయమూర్తి పదవీ విరమణ పొందినా, బదిలీ అయినా, బార్‌ కౌన్సిల్, న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాలు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఆ కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి బరువెక్కిన హృదయంతో అందరికీ సారీ అంటూ లేఖ రాసి పెట్టి కోల్‌ కతాకు సంజీబ్‌ బెనర్జీ వెళ్లిపోయారు. 

రోడ్డు మార్గంలో పయనం..
బుధవారం సీజే బెంచ్‌ పదికి పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. అయితే, ఎవ్వరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం హైకోర్టు సిబ్బంది, సహచర న్యాయమూర్తులకు లేఖ రాసి ఐ యామ్‌ సారీ, కృతజ్ఞతలు అని పేర్కొంటూ రోడ్డు మార్గంలో కోల్‌ కతాకు బయలు దేరి వెళ్లారు. తాను ఏ పనిచేసినా హైకోర్టు కోసమే చేశానని గుర్తు చేస్తూ, వీడ్కోలు కార్యక్రమానికి సైతం దూరం వెళ్తున్నానని పేర్కొన్నారు.

ఆనందంగానే బయలు దేరుతున్నానని ముగించారు. దీంతో సీనియర్‌ న్యాయమూర్తి దురైస్వామి కేసుల విచారణపై దృష్టి పెట్టారు. ఇక, అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన సీనియర్‌ న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ బండారిని హైకోర్టు తాత్కాలిక ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తిగా  నియమించారు. ఆయన గురు లేదా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 


 

మరిన్ని వార్తలు