కలెక్టర్‌వా? పోలిటికల్‌ ఏజెంట్‌వా?.. ఓడిన బీజేపీ క్యాండిడేట్‌ను విజేతగా ప్రకటించిన కలెక్టర్‌పై జడ్జి ఫైర్‌

4 Aug, 2022 21:34 IST|Sakshi

భోపాల్‌: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని పక్కనపెట్టి.. ఓడిన అభ్యర్థిని విజేతగా ప్రకటించిన నేరానికి ఓ ఐఏఎస్‌ అధికారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌ పోస్ట్‌కే అనర్హుడివంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. 

మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించారు పన్నా జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ మిశ్రా. దీంతో న్యాయమూర్తి ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


పన్నా కలెక్టర్‌ సంజయ్‌ మిశ్రా-ఫైల్‌ ఫొటో

పన్నా జిల్లాలో జులై 27వ తేదీన 25 మంది సభ్యులున్న గున్నూర్‌ జనపద్‌ పంచాయతీకి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు జరిగాయి. వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ అభ్యర్థి పరమానంద శర్మ బీజేపీ అభ్యర్థి రామ్‌శిరోమణి మిశ్రాను ఓడించారు. అయితే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ పరమానంద శర్మను విజేతగా ప్రకటించగా.. రామ్‌శిరోమణి మాత్రం పన్నా కలెక్టర్‌ సంజయ్‌ మిశ్రాను ఆశ్రయించి వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. దీంతో ఆ మరుసటి రోజు లాటరీ ద్వారా ఎన్నికలు నిర్వహించి.. రామ్‌శిరోమణిని విజేతగా ప్రకటించారు కలెక్టర్‌ సంజయ్‌ మిశ్రా. 

దీంతో పరమానంద శర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనను వినిపించేందుకు సమయం కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో అభ్యర్థించారు.  పిటిషన్‌పై విచారణ సందర్భగా..  జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌, కలెక్టర్‌ సంజయ్‌ మిశ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక పొలిటికల్‌ ఏజెంట్‌గా వ్యవహారించారు. కలెక్టర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదు. కలెక్టర్‌ విధుల నుంచి ఆయన్ని తొలగించాలి అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు