కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం

7 Apr, 2021 13:38 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: ఇంట్లో వారికి కరోనా సోకినందున కచ్చితంగా కోవిడ్‌ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఆదేశించినా రాజకీయ నాయకులే పెడచెవిన పెడుతున్నారు. జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి సోమవారం రాత్రి రామనగర పట్టణంలో జరిగిన జేడీఎస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గత వారం కుమారస్వామి బెంగళూరులో కోర్టులో ఒక కేసు వాయిదాకు హాజరవ్వాల్సి ఉంది. అయితే తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని లాయర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

ఇందుకు సరేనన్న జడ్జి ఈ నెల 17వ తేదీ వరకూ కుమారస్వామి ఎటువంటి సమావేశాల్లో, సభల్లో కనిపించరాదని, తాను టీవీ, పేపర్లలో చూస్తుంటానని, అలా జరిగితే అరెస్టు వారెంట్‌ జారీ చేస్తానని హెచ్చరించారు. అయితే కుమారస్వామి జడ్జి హెచ్చరికలు బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా బారిన పడిన విషయం విదితమే. 

చదవండి: దేవెగౌడ దంపతులకు కోవిడ్‌

మరిన్ని వార్తలు