నీట్‌ పీజీ కటాఫ్‌లో...15 పర్సంటైల్‌ తగ్గింపు

13 Mar, 2022 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పీజీ మెడికల్‌ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్‌–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్‌ను 15 పర్సంటైల్‌ మేరకు తగ్గించాలని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్‌బీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్‌ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఆ మేరకు క్వాలిఫయింగ్‌ కటాఫ్‌ జనరల్‌ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్‌ (జనరల్‌)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్‌ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్‌ రౌండ్‌లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. 

(చదవండి: భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్‌’ విద్యార్థుల పిటిషన్‌)

మరిన్ని వార్తలు