అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు

22 Nov, 2022 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్‌ సెంట్లు(బీఎంఎస్‌), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్‌)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్‌ సెంట్ల ధరలు తగ్గనున్నాయి.

ధరలపై నేషనల్‌ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్‌ఎల్‌ఈఎంలో ఉన్న మందులను ఎన్‌పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. 

మరిన్ని వార్తలు