Monsoon 2021: ఈ ఏడాది సాధారణ వర్షపాతం

14 Apr, 2021 18:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకర స్థాయిగా పేర్కొన్న స్కైమెట్‌

న్యూఢిల్లీ: దేశంలో కురిసే 75 శాతంపైగా వర్షపాతానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది సాధారణంగా ఉంటాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలల సరాసరి వర్షపాతం 103 శాతంగా ఉంటుందని, ఈ అంచనాకు అటూఇటూగా 5 శాతం మాత్రమే తేడా ఉండే అవకాశముందని స్కైమెట్‌ వాతావరణ విభాగం ప్రెసిడెంట్‌ జీపీ శర్మ తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన సాధారణ పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు.

రుతు పవనాలు సాధారణంగా ఉండేందుకు 65%, సాధారణంగా కంటే ఎక్కువగా ఉండేందుకు 15%వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 96–104 మధ్యలో వర్షపాతం ఉంటే సాధారణంగా, 103 ఉంటే సాధారణంగా కంటే ఎక్కువగా పరిగణిస్తారు. నెలల వారీగా చూస్తే, జూన్‌లో సరాసరి వర్షపాతం 106%, జూలైలో 97%, ఆగస్టు, సెప్టెంబర్‌లలో 99%, 116 శాతం కురిసే అవకాశాలున్నాయని స్కైమెట్‌ తెలిపింది.

వరసగా మూడో ఏడాది 2021లో కూడా రుతుపవనాలు సానుకూలంగా ఉన్నాయని జీపీ శర్మ తెలిపారు. గడిచిన రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందన్నారు. భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని చెప్పారు. పసిఫిక్‌ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతున్న లానినా ప్రభావం నెమ్మదించడంతోపాటు ఈ సీజన్‌లో స్థిరంగా ఉండే అవకాశముందని స్కైమెట్‌ సీఈవో యోగేశ్‌ పాటిల్‌ చెప్పారు. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారిక అంచనాలను ఈ వారంలోనే విడుదల చేయనుంది.  

ఇక్కడ చదవండి:
గుడ్‌న్యూస్‌: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు

టైమ్‌ మెషీన్స్‌: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే!

మరిన్ని వార్తలు