పెరిగిన గుండెపోటు కేసులు.. నాలుగేళ్లలో అక్కడ 80 వేలకుపైగా మృతి

30 Sep, 2022 07:18 IST|Sakshi

కోవిడ్‌ కాలంలోనే 25,378 మంది మృత్యువాత

కోవిడ్‌కు గురైన వారిలో 21 శాతం అధికంగా గుండెపోటుకు అవకాశం

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలంటున్న హృదయ వ్యాధుల నిపుణులు

సాక్షి, ముంబై: కోవిడ్‌–19 మహమ్మారి తర్వాత ముంబైకర్లలో గుండెపోటు కేసులు, గుండెపోటుతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో బీఎంసీ, ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ఆందోళనలో పడిపోయాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ దాదాపు నియంత్రణలోకి రావడంతో పరిస్ధితులు యథాతధంగా మారాయి. కానీ గడచిన నాలుగేళ్లలో ముంబైలో 80 వేలకుపైగా గుండెపోటుతో మృతి చెందినట్లు నమోదైన కేసులను బట్టి తెలిసింది.

అందులో కోవిడ్‌ కాలం అంటే ఒక్క 2020లోనే 25,378 మంది మృతి చెందారు. ఈ సంఖ్యను బట్టి ముంబైలో ప్రతీరోజు సగటున 70 మంది గుండెపోటుతో మృతి చెందినట్లు స్పష్టమైతోంది. దీంతో సెప్టెంబర్‌ 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ సందర్భంగా ముంబైకర్లు తమ గుండెను భద్రంగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా నరాలలో రక్తం గడ్డ కట్టడం, గుండె మండటం, వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు పెరిగాయి.

అందుకు కారణం వ్యసనాలు, తరుచూ అనారోగ్యానికి గురికావడం, అనోబాలిక్‌ స్టెరాయిడ్‌ లాంటి పదార్ధాలను విచ్చలవిడిగా వినియోగం పెరిగిపోవడంవల్ల గుండెపోటు, మరణాలు పెరిగిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కోవిడ్‌ సోకి, వ్యాధి నయం అయిన వ్యక్తుల్లో గుండెపోటు లేదా స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు 21 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తికి గుండెపోటు రావడం వెనక గుండె దిశగా వెళ్లే నరాల్లో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణం కావచ్చని ఫోర్టీస్‌ ఆస్పత్రికి చెందిన డా.మనీష్‌ హిందుజా పేర్కొన్నారు.

గుండెపోటు నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ప్రతీరోజు తినే ఆహరాన్ని నియంత్రణలో ఉంచాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు నడవాలి. తమ శరీర తత్వాన్ని, తట్టుకునే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంతే సమయం వ్యాయామం చేయాలని కేం ఆస్పత్రిలోని డి.ఎం.కార్డియాలాజీ విభాగం యూనిట్‌ చీఫ్, ప్రొఫెసర్‌ డా.చరణ్‌ లాంజేవార్‌ పేర్కొన్నారు. ఇందులో ఏదో ఒక దాంట్లో నియంత్రణ కోల్పోయినా లేదా పాటించకపోయినా గుండెపోటు రావడం, ఆ తర్వాత సకాలంలో చికిత్స అందకపోవడంతో మరణించడం లాంటివి చోటుచేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు