తల్లి గుండె బద్ధలైంది: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

30 May, 2022 13:08 IST|Sakshi

వైరల్‌: అప్పటిదాకా తల్లి చాటుగా పెరిగిన బిడ్డ.. ఆ తల్లి కళ్ల ముందే మరణిస్తే ఎలా ఉంటుంది?. మనిషి అయినా నోరు లేని జీవి అయినా అమ్మ ప్రేమ ఒక్కటే కదా!. అందుకే ఆ తల్లి ఏనుగు తల్లడిల్లింది. బరువెక్కిన గుండెతోనే బిడ్డను మోసుకుంటూ బయలుదేరింది. హృదయ విదారకమైన ఘటన.. వైరల్‌ అవుతూ ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. 

తన కళ్ల ముందే మరణించిన ఓ గున్న ఏనుగును మోసుకుంటూ ముందుకెళ్లింది ఓ ఏనుగు. ఆ నడక ఆగిపోకుండా.. చాలా దూరం అలా ముందుకు సాగింది. హఠాత్తుగా ఏమైందో తెలియదు.. ఆ తల్లి ఏనుగు, గున్నేనుగు శవంతో కనిపించకుండా పోయింది.  బెంగాల్‌ జలపైగురిలో టీ ఎస్టేట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

అంబరీ టీ ఎస్టేట్‌లో ఓ ఏనుగు.. తన కళ్ల ఎదురుగా చనిపోయిన గున్న ఏనుగు దేహాన్ని ఎత్తే ప్రయత్నం చేసింది. ఇబ్బంది పడుతూనే తొండంతో ఆ శవాన్ని పైకి ఎత్తి దంతాల మధ్య పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. పచ్చి నీళ్లు, ఆహారం ముట్టకుండా ముందుకు సాగింది. బిడ్డ కిందపడిపోయిన శక్తినంతా కూడదీసుకుని మళ్లీ పైకి ఎత్తి ముందుకు సాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు.

బనారహత్‌ బ్లాక్‌ దూవార్స్‌ రీజియన్‌లోని చునాభటి టీ గార్డెన్‌ సమీపంలోని అడవిలో శుక్రవారం ఉదయం ఆ గున్నేనుగు మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది ఎలా చనిపోయింది కారణం మాత్రం నిర్ధారించుకోలేకపోయారు. అయితే చనిపోయిన తన బిడ్డను మోసుకుంటూ మరో 30-35 ఏనుగులతో కూడిన మందతో ఆ తల్లి ఏనుగు ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. 

దాదాపు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి.. చునాభటి నుంచి అంబరి టీగార్డెన్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి డయానా టీ గార్డెన్‌ నుంచి న్యూదువార్స్‌ టీ గార్డెన్‌ వైపు వెళ్లింది. చివరకు రెడ్‌బంక్‌ టీ గార్డెన్‌లోని పొదల్లో బిడ్డ శవాన్ని ఉంచింది. మిగతా ఏనుగులన్నీ అడవి వైపు మళ్లాయి. కానీ..

ఆ ఏనుగుల కదలికలను పరిశీలించిన అధికారులకు ఆ గున్నేనుగు శవం దొరకలేదు.. సరికదా ఆ తల్లి ఏనుగు మంద నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు