ప్రేమలో ఓడిపోయాడు, జీవితంలో గెలిచాడు!

19 Jan, 2021 19:40 IST|Sakshi

డెహ్రాడూన్‌: నలుగురూ బాగుండాలి, అందులో నేనుండాలి... అనుకున్నాడు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి. అందుకే పగిలిన హృదయాలను అతికించలేకపోయినా కనీసం వారి మనసుకు స్వాంతన చేకూర్చాలనుకున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయండి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రాకు 21 ఏళ్లుంటాయి. అతడు ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. కానీ లాక్‌డౌన్‌లో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి ఈ ప్రేమజంటను విడదీశారు. నెచ్చెలి దూరం కావడంతో కుంగిపోయాడు. హైస్కూల్‌ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని హఠాత్తుగా మర్చిపోలేక నరకం అనుభవించాడు. ఆరు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. పబ్జీకి బానిసగా మారాడు. ఈ మనోవేదనలోనే కొట్టుమిట్టాడుతున్న అతడికి హఠాత్తుగా ఓ రోజు ఇలా ఎంకెంతకాలం ఆమెను గుర్తు చేసుకుంటూ పిచ్చివాన్నైపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆమె జ్ఞాపకాలకు తాళం వేసి ఓ కెఫేను ప్రారంభించాడు. దానికి దిల్‌ తుట ఆషికి-చాయ్‌వాలా అన్న పేరును ఖరారు చేశాడు. ఇక్కడ లవ్‌లో ఫెయిలయిన వాళ్లు వారి బాధను మనసారా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిది బ్రేకప్‌ అయిన ఎంతోమందికి ఆశాదీపంగా కనిపిస్తోంది. (చదవండి: ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?)

ఈ కెఫే గురించి దివ్యాన్షు మాట్లాడుతూ.. "నాలానే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. వాళ్ల మనసులోని బాధనంతా కక్కేస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రేకప్‌ అయినవాళ్లను నా కెఫెకు వచ్చి వాళ్ల కథలను చెప్పమంటాను. అలా వారి భారాన్ని ఇక్కడే దించేసుకుని జీవితంలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కెఫే ఐడియా విని దివ్యాన్షు తండ్రి కోప్పడ్డాడట. దీని గురించి అతడు మాట్లాడుతూ... "ఒక అమ్మాయి కోసం నేను పిచ్చోడిలా అయిపోయాను. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నప్పుడు అమ్మ నాకు సపోర్ట్‌ చేసింది. కానీ కెఫే పేరు చెప్పగానే నాన్న ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు నాన్న స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కెఫె గురించి, దాని ప్రాముఖ్యతను గూర్చి మెచ్చుకున్నాడు. అప్పుడు కానీ మా నాన్న నేనో మంచి పని చేస్తున్నానని అంగీకరించలేకపోయాడు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్‌ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో కూడా ఈ కెఫెను ప్రారంభించాలనుకుంటున్నాడు. (చదవండి: బైక్‌, వ్యాన్‌ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!)

మరిన్ని వార్తలు