కాలుష్య కాసారంగా బెంగళూరు.. ఢిల్లీ తరహా పరిస్థితులు!

7 Dec, 2022 07:55 IST|Sakshi

నానాటికీ పెరిగిపోతున్న మితిమీరిన వాహనాల సంఖ్య.. తద్వారా వెలువడుతున్న ట్రాఫిక్‌ ఉద్గారాల కారణంగా సిలికాన్‌ సిటీ బెంగళూరు నగరం కాలుష్య కాసారంగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో బెంగళూరులోనూ వాయు కాలుష్య పరిమాణం గణనీయంగా పెరుగుతున్నది. 

దీంతో రానురాను ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ ఉపయోగించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు రావాల్సిన పరిస్థితుల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కాగా, గతేడాదితో పోలిస్తే  నగరంలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) సమారు 40 శాతం పెరిగింది. దీంతో గతేడాది నవంబర్‌లో 66 ఏక్యూఐ ఉండగా ఈ ఏడాది అదే సమయానికి 93కు చేరుకుంది. 

కాగా, శీతాకాల సహజ వాతావరణ పరిస్థితులకు తోడు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ ఉద్గారాల కారణంగా కూడా ఏక్యూఐ పెరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నగరంలో వాయు కాలుష్య ప్రమాణాన్ని కొలిచేందుకు ఏడు వేర్వేరు చోట్ల కేంద్రాలను ప్రారంభించారు. ఢిల్లీ తరహా పరిస్థితులు బెంగళూరులో క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. ఏక్యూఐ వెబ్‌సైట్‌లో క్రమంగా బెంగళూరులో గాలి నాణ్యత సూచీ పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఏక్యూఐ 150కి చేరుకుంటుందని ఆ వెబ్‌సైట్‌ అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు