వీడియో: జడివానతో ఘోరంగా దెబ్బ తిన్న సిలికాన్‌ సిటీ.. వైరల్‌

20 Oct, 2022 07:33 IST|Sakshi

బెంగళూరు: సిలికాన్‌ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు మరోసారి వర్షం ధాటికి ఘోరంగా దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన జడివానతో నగరం నీట మునిగింది. దెబ్బ తిన్న నగరం ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ప్రజాప్రతినిధులను ‘ఇదేనా తీరు?’ అంటూ నిలదీస్తున్నారు పలువురు.

బెంగళూరు తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతంలో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. గరిష్టంగా రాజమహల్‌ గుట్టహల్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోసారి భారీ వాన ముప్పు పొంచి ఉండడంతో అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. మరో మూడు రోజులు వర్ష ప్రభావం కొనసాగుతుందని నగర వాసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 

నెల కిందట ఏకధాటిగా కురిసిన వర్షాలకు నగరం ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నగర దుస్థితిపై రాజకీయ విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే.. బుధవారం సాయంత్రం కురిసిన వానతో నగరం మరోసారి నీట మునిగిపోయింది. సరిగ్గా ఏడున్నర గంటల ప్రాంతలో జోరు వాన పడడం, ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్లతో రోడ్లు జామ్‌ అయ్యాయి. రోడ్లు, సెల్లార్లు నీట మునిగాయి. వాహనాలు భారీ సంఖ్యలో దెబ్బ తిన్నాయి.

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో 1,706 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంతకు ముందు.. 2017లో 1,696 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుగా నమోదు అయ్యింది. అక్రమ కట్టడాల మూలంగానే నగరం ఈ స్థితికి చేరుకుందని ఇంజినీరింగ్‌ నిపుణులు ఇచ్చిన నివేదికలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది కూడా. 

మరిన్ని వార్తలు