Weather Forecast : వచ్చే వారం ఈ నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

13 Nov, 2021 18:37 IST|Sakshi

సాక్షి, చెన్నై : రోజులు గడుస్తున్న కొద్దీ తమిళనాడులో వర్షాల బీభత్సం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు కుండపోత వర్షాలతో అల్లాడిపోతున్నాయి. అనేక ఊర్లు, పట్టణాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నై నగరాన్ని కూడా ఇంకా వరద ముప్పు వీడలేదు. చెన్నై వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని కన్యాకుమారి, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూరు, ధర్మపురి, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, నామక్కల్, కరూర్, దిండిగల్, సేలం, నీలగిరి, కోయంబత్తూర్, తేని, పెరంబలూర్, తిరుచిరాపల్లి , మధురై, విరుదునగర్, తెంకాసిలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 
చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం: వారం రోజులపాటు..

కేరళకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ
భారత వాతావరణ శాఖ కేరళలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అత్యవసర సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. 
చదవండి: ప్రపంచవ్యాప్తంగా మన నగరమే మొదటి స్థానం.. కానీ అదో చెత్త రికార్డ్

వచ్చే వారం కొనసాగనున్న వర్షాలు
మరికొన్ని రోజులు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. వచ్చేవారం కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  శనివారం నాడు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న థాయ్‌లాండ్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  భారత వాతావరణ శాఖ ప్రకారం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, మరింత బలపడి, నవంబర్ 18 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.  అండమాన్‌ నికోబార్ దీవులలో సోమవారం వరకు.. కోస్తా ఆంధ్రాలో నవంబర్ 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చదవండి: వైరల్‌: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్‌.. కొంచెం బొద్దుగా ఉండటంతో..

నవంబర్ 16 వరకు దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 17 న ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. నవంబర్ 17 నుంచి ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం వరకు అండమాన్ సముద్రం,  ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచించింది. బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు.

మరిన్ని వార్తలు