ముంబైలో వర్ష బీభత్సం .. 30 మంది మృతి

19 Jul, 2021 07:49 IST|Sakshi
ప్రమాదం సంభవించిన ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

సాక్షి, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల కారణంగా నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 30 మంది మృతి చెందారు. ముఖ్యంగా చెంబూర్‌లో 19 మంది, విక్రోలిలో 10 మంది, భాండూపులో ఒక్కరు.. మొత్తం 30 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తుండడంతో సహాయక చర్చలు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చెంబూర్‌ వాషినాకా న్యూ భరత్‌నగర్‌లోని వంజార్‌ దాండా పరిసరాల్లో కొండ కింద ఉన్న ప్రహరీపై కొండచరియలు విరిగిపడ్డాయి.

దీంతో ఈ గోడ కూలి ఇళ్లపై పడింది. ఈ సంఘటనలో రాత్రి వరకు అందిన సమాచారం మేరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తున్నారు. విక్రోలిలోని సూర్యనగర్‌ ప్రాంతంలో ఓ రెండు అంతస్తుల భవనం కూలడంతో 10 మంది మృతి చెందారు. భాండూప్‌లో ప్రహరీ కూలి ఒక బాలుడు చనిపోయాడు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు పరిహారం ప్రకటించాయి. ముంబై వరదల్లో ప్రాణనష్టంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  సానుభూతి తెలిపారు.

అత్యంత భారీ వర్షాలు 
భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు కేవలం అయిదు గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. గిర్‌గావ్, లోవర్‌పరెల్, ఎలి్ఫస్టన్‌ రోడ్డు, పరెల్, దాదర్, వర్లీ, మాటుంగా, కింగ్‌ సర్కిల్, సైన్, కుర్లా, బాంద్రా, బోరివలి తదితర ప్రాంతాలతోపాటు థాణే, పాల్ఘర్, నవీముంబై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక నివాస ప్రాంతాలు జలాశయాలను తలపింపజేశాయి. రహదారులపై నీరు నిల్చి పోవడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సెంట్రల్, వెస్ట్రన్, హార్బర్‌ రైల్వే మార్గాల్లో రైళ్ల రాకపోకలు కూడా స్తంభించాయి. ముంబైలోని కొన్ని ప్రాంతాలకు నీరందించే నీటిశుద్ధి సముదాయం నీట మునగడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు