కశ్మీర్, హిమాచల్‌లో ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి

29 Jul, 2021 08:21 IST|Sakshi

మినీ విద్యుత్‌ ప్రాజెక్టు ధ్వంసం

జమ్మూ/షిమ్లా: జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌లు బుధవారం ఆకస్మిక వరదలతో వణికిపోయాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బీభత్స వానలకు 17 మంది ప్రాణాలు కోల్పోతే పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. కశ్మీర్‌లోని మారుమూల గ్రామమైన కిస్త్వార్‌లో భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. 30 మందికిపైగా గల్లంతయ్యారు. ఇళ్లు,  గోశాలలు నీట మునిగాయి. లద్దాఖ్‌లో భారీ వర్షాలకు కార్గిల్‌ సమీపంలో ఉన్న మినీ విద్యుత్‌ ప్లాంట్‌ ధ్వంసమైంది.

హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఉదయ్‌పూర్‌లోని టోజింగ్‌ నల్లాలో వరదలకు ఏడుగురు మరణించారు. చంబాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్‌ సుదేష్‌  చెప్పారు. కశ్మీర్‌లోని కిస్త్వార్‌లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని రకాలుగా కశ్మీర్‌కు సాయం అందిస్తామని అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌తో మాట్లాడారు. కిస్త్వార్‌లో ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీయగా, 17 మంది క్షతగాత్రుల్ని వరద ముప్పు నుంచి కాపాడినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు