గంటన్నర టెన్షన్‌

17 Aug, 2020 07:38 IST|Sakshi

ఆకాశంలోనే విమానం రౌండ్లు  

కర్ణాటక, హుబ్లీ: ప్రతికూల వాతావరణం వల్ల హుబ్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం దట్టంగా మేఘావృతం కావడంతో పాటు వర్షం కురుస్తుండడంతో విమానాలను ల్యాండ్‌ చేయడానికి పైలట్లు తటపటాయించారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఉదయం 8.55 గంటలకు హుబ్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే తీవ్రమైన వాతారణ ప్రతికూల పరిస్థితుల వల్ల దిగడానికి సిగ్నల్‌ దొరక్క ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.

ఒకవేళ ఇక్కడ సాధ్యం కాకపోతే మంగళూరు, లేదా గోవా విమానాశ్రయాలలో దించాలని అనుకున్నారు. చివరకు సిగ్నల్‌ లభించడంతో 10.25 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్‌ సాధ్యమైంది. దీంతో సుమారు గంటన్నర పాటు విమానంలోను, విమానాశ్రయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ విమానంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అనంతకుమార్‌ హెగ్డేతో పాటు 49 మంది ప్రయాణికులున్నారు. కాగా, మరో 2 విమానాలు దిగకుండానే బెంగళూరుకు వెనుదిరిగాయి.

మరిన్ని వార్తలు