ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

9 Jun, 2021 10:25 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్‌ రైళ్లు నిలిచిపోయాయి. మహారాష్ట్రను ఒకరోజు ముందే రుతుపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్‌ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్‌, పుణె, బీడ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ముఖ్యమంత్రి ముందస్తు సూచనలు 
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెంటనే ముంబై రీజియన్, కొంకణ్‌ రీజియన్‌లోని అన్ని జిల్లాలకు చెందిన ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ మాట్లాడుతూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తే సాయం కోసం కోస్టు గార్డులు, సైన్యం సిద్ధంగా ఉండాలని సూచనలివ్వాలని తెలిపారు.  జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబైసహా ఇతర కార్పొరేషన్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్పొరేషన్ల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ తగిన సూచనలివ్వాలని తెలిపారు. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కొరత, మందుల కొరత లేకుండా చూడలి. అవసరమైతే వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యంత్రసామగ్రిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఆస్పత్రుల్లో జనరేటర్లు, వాటికి అవసరమైన డీజిల్‌ ముందుగానే సమకూర్చుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదివరకే నగరంలో లోతట్టు ప్రాంతాలున్న చోట వర్షపు నీరు బయటకు తోడేందుకు 474 మోటర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. అత్యవసరం సమయంలో సాయం కోసం ఎదురుచూసే బాధితులకు అన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లు పనిచేసేలా చూడాలన్నారు. కంట్రోల్‌ రూముల్లో 24 గంటలు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు.   
చదవండి: Coronavirus: స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు

మరిన్ని వార్తలు