ముంబైలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ

5 Aug, 2020 08:18 IST|Sakshi

ముంబై :  భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రైలు, రోడ్డు మార్గాలన్నీ స్తంభించాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. (బీరూట్‌ భారీ పేలుళ్లు, 70మంది మృతి )

ఈ రోజు ముంబైలో అత్యవసర, నిత్యవసరాలు మినహా మిగతా షాపులు తీయవద్దని బీఎంసీ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పెను సమస్యగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. దీనికి తోడు ఉత్తరప్రదేశ్‌, కేరళ, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు