భారీ వర్షాలు.. గోడ కూలి వాహనాలు ధ్వంసం

19 Aug, 2020 14:40 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజిమాబాద్‌లో బుధవారం ఉదయం వర్షం కుండపోతగా కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న సరిహద్దు గోడ కూలిపోవడంతో సాకేత్ ప్రాంతంలోని జే బ్లాక్‌లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి..)

రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తున్నారు. లాజవంతి ఫ్లై ఓవర్‌ సమీపంలో కస్టర్‌ బస్సు ఆగిపోవడంతో  ఫ్లైఓవర్ నుంచి ధౌలా కువాన్ వైపు క్యారేజ్‌వేలో ట్రాఫిక్ జామ్‌ అయ్యిందని.. ధౌలా కువాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం మాయాపురి చౌక్‌ ద్వారా వెళ్లాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. (నోయిడా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం)

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుందని, రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే  ఆగష్టు 23 వరకు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. 

మరిన్ని వార్తలు