చెన్నైలో వాన బీభత్సం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు 

2 Nov, 2022 11:28 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం, శివారు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివరాలు.. రాష్ట్రంలోకి గత నెల 29వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడైంది.

ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి నుంచి చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాలను వరుణుడు వణికించాడు.  దీంతో ఆయా జిల్లాల్లో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు 4వ తేదీ వరకు కొనసాగుతాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.  

ఒక్క రాత్రి వానకే చెన్నై.. 
చెన్నైలో వరద ముంపును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కొన్ని నెలల ముందుగానే అప్రమత్తమైంది. అయితే వర్షపు నీటి కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా, సోమవారం రాత్రి భారీ వర్షానికి నగరం జలమయమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన మార్గాలపై వరద పోటెత్తింది. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్, మైలాపూర్, టీనగర్, వడపళని, గిండి, వేళచ్చేరి, కీల్పాక్కం, కోయంబేడు, మదురవాయల్, పోరూర్, కుండ్రత్తూర్, మీంజూరు, పొన్నేరి, పుళల్, చోళవరం, రెట్టేరి, తాంబరం, గూడువాంజేరి పరిసరాల్లో భారీ వర్షం పడింది. ఇక్కడున్న లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరాయి.

మంగళవారం కూడా వర్షాలు కొనసాగడంతో చెన్నై, తాంబరం, ఆవడి కార్పొరేషన్‌ల అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రోడ్లపై నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించారు. గాలి కారణంగా 5 చోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనుండడంతో ముందు జాగ్రత్తలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా చెన్నై రిప్పన్‌ బిల్డింగ్‌లో సహాయక చర్యల నిమిత్తం అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక్క రాత్రి వానకే నగరం జలమయం కావడంతో.. మున్ముందు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు ఎక్కువకాలం నిల్వవున్నా, ఇతర సహాయక చర్యల కోసం  1919, 044–25619206, 25619207, 25619208 నంబర్లను సంప్రదించాలని చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ తెలిపారు.  

రిజర్వాయర్లలో..  
చెన్నైకు తాగునీటి అందించే చెరువులు, రిజర్వాయర్లలోకి ఇన్‌ ఫ్లో పెరిగింది. 3,300 మిల్లియన్‌ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన పుళల్‌ రిజర్వాయర్‌లోకి సెకనుకు 967 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 21 అడుగులు కలిగిన ఈ రిజర్వాయర్‌ నీటిమట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరుకుంది. 3,645 మిల్లియన్‌ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు నీటి రాక పెరిగింది.

కందన్‌కోట సేరువాయ్‌ కండ్రిగ రిజర్వాయర్‌ నిండింది. ఇందులో నుంచి సెకనుకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చెన్నై, పూండి రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ప్రవహిస్తున్న కూవం నదిలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఈ నది తీరంలోని నేల వంతెన రోడ్డు మార్గాన్ని కూలి్చవేశారు.  

ఇద్దరి మృతి 
చెన్నైలో వర్షం కారణంగా విద్యుదాఘాతానికి ఒకరు, ఇంటి బాల్కని కూలి మరొకరు మృతి చెందారు. వ్యాసర్‌పాడికి చెందిన దేవేంద్రన్‌(55) సోమవారం ఈబీ కాలనీలోని నివాసానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మరణించాడు. పుళియాంతోపు, ప్రకాశ్‌రావు కాలనీకి చెందిన కబాలి, శాంతి (45) దంపతులు ఓ బహుళ అంతస్థుల భవనంలో నివాసం ఉన్నారు. అది పాత భవనం కావడంతో మంగళవారం ఉదయం తొలి అంతస్తు భవనం బాల్కని కూలి శాంతిపై పడింది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. 

ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
తిరువళ్లూరు: వర్షపునీటి నిల్వ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి నాజర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆవడిలోని పరుత్తిపట్టు, శ్రీరామ్‌నగర్‌ల్లోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి నాజర్‌ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆవడి ప్రాంతంలో వర్షపు నీటికాలువల నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందన్నారు. నీరు నిలిచిన వెంటనే మోటార్ల ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మేయర్‌ ఉదయకుమార్‌ ఉన్నారు.  

23 చోట్ల వరద ముప్పు
వేలూరు: వేలూరు జిల్లాలో మొత్తం 23 చోట్ల వరద ముప్పు ఉన్నట్లు ఎస్పీ రాజేష్‌ కన్నన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వేలూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. వేలూరు నేతాజీ మైదానంలో పోలీసులు, అగి్నమాపక సిబ్బందికి వరద ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, రోడ్లపై చెట్లు పడిన వెంటనే వాటిని తొలగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వారికి అవసరమైన పరికరాలను ఎస్పీ అందజేశారు. వరద సమాచారాన్ని అందించేందుకు 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెల్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ఆయా తాలుకా కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   

సీఎం సమీక్ష 
రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య రుతు పవనాల ప్రభావం తీవ్రం కావడంతో అధికారులను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అప్రమత్తం చేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన నివాసం నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి కె.కె.ఎస్‌.ఎస్‌.ఆర్‌ రామచంద్రన్, సీనియర్‌ ఐఏఎస్‌లు ఎస్‌.కె.ప్రభాకర్, కుమార్‌ జయంత్‌ కూడా హాజరయ్యారు. చెన్నై, శివారుల్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నీటి తొలగింపు పనుల వివరాలను తెలుసుకున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక శిబిరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, హెచ్చరిక బోర్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి దురైమురుగన్, సీఎస్‌ ఇరై అన్బు, సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్షం పాతం వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెన్నైలో నీరు నిల్వ ఉండకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.  

మరిన్ని వార్తలు